“వక్రతుండ మహాకాయ”

“వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా”

శ్లోక భావం

“వంకర తొండం కలిగి, పెద్ద దేహం కలిగి, కోటి సూర్యుల వలె ప్రకాశించే గణపతీ! నా ప్రతి కార్యంలోనూ, ప్రతి సమయంలోనూ,ఎటువంటి అడ్డంకులు లేకుండా కార్యం పూర్తీ చేయుము.”

ఈ శ్లోకం యొక్క కేంద్రార్థం: పని ప్రారంభంలో మనస్సుకు స్థిరత్వం, కార్యానికి ఆటంకం రాకుండా ఉండడం.

ఏ పనినైనా ప్రారంభించే ముందు చదివే శ్లోకం “వక్రతుండ మహాకాయ…”

మన భారతీయ జీవన విధానంలో “ ప్రారంభంలో ” అనే పదానికి ఎంతో విలువ ఉంది. ఏ పని ఎలా ప్రారంభమవుతుందో, అదే దాని ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అన్న నమ్మకం మనకు పురాతనకాలం నుంచే ఉంది. అందుకే ఏ చిన్న పని మొదలెట్టినా, ఏ పెద్ద యజ్ఞం ఆరంభించినా, ముందుగా గణపతిని స్మరించడం సంప్రదాయంగా మారింది. వక్రతుండ మహాకాయ…” అనే శ్లోకం, ఈ సంప్రదాయానికి ప్రాణం.
ఈ శ్లోకం కేవలం ఒక మంత్రం కాదు. ఇది ఒక మానసిక సిద్ధత.

గణపతి అంటే కేవలం దేవత రూపం మాత్రమే కాదు. ఆయన బుద్ధికి ప్రతీక, వినయానికి చిహ్నం, అడ్డంకులను జయించే శక్తికి రూపం. వక్రతుండుడు అంటే నేరుగా కాకుండా ఆలోచించే తెలివి.
మహాకాయుడు అంటే సమస్య ఎంత పెద్దదైనా ఎదుర్కోగల ధైర్యం. సూర్యకోటి సమప్రభ అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానప్రకాశం.

ఈ శ్లోకం చదివేటప్పుడు మనం కోరేది ఒక్కటే: “నా పని సజావుగా జరగాలి.”
కానీ లోతుగా చూస్తే, మనం అడుగుతున్నది మరొకటి మన మనస్సు అడ్డంకుల్లేకుండా స్థిరంగా ఉండాలి అని. చాలాసార్లు పనులు ఆగిపోవడానికి కారణం బయట పరిస్థితులు కాదు. మనలోని భయం, అనిశ్చితి, ఆత్మవిశ్వాస లోపమే అసలు అడ్డంకి. ఈ శ్లోకం ఆ అంతర్గత అడ్డంకులను తొలగించే ఒక మానసిక బలాన్ని ఇస్తుంది. అందుకే ఈ శ్లోకం:

చదువు మొదలెట్టే ముందు, పరీక్షకు ముందు, వ్యాపారం ప్రారంభించే ముందు, పూజ, యజ్ఞం మొదలెట్టే ముందు, కొత్త జీవన దశ ఆరంభంలో అన్ని సందర్భాల్లో చదువుతారు.

ఈ శ్లోక గొప్పతనం దాని సరళతలో ఉంది. పెద్ద తత్వవాదం చెప్పదు. పెద్ద పెద్ద మాటలు, అలంకారిక భాష ఉండదు. కేవలం ఒక ప్రార్థన.“అడ్డంకులు తొలగించు” అన్న వినయపూర్వక అభ్యర్థన. ఈ శ్లోకం మనకు నేర్పేది ఒకే సత్యం: మంచి ఆరంభమే సగం విజయము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top